రాజకీయాల్లో నాయకులకు కొన్ని విలువలు ఉండాలి…నిజాయితీగా రాజకీయం చేయాలి. అప్పుడే అలాంటి నాయకులని ప్రజలని ఆదరించే పరిస్తితి ఉంటుంది. అలా కాకుండా అడ్డగోలుగా రాజకీయం చేస్తూ, ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తోక్కే వారిని ప్రజలు బొంద పెట్టేస్తారని చెప్పాలి. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇదే జరిగేలా కనిపిస్తోంది. సరిగ్గా ఉపఎన్నికకు వారం రోజుల సమయం ఉంది.
ఇక ఈలోపు గెలవడానికి అందరూ తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజలు గెలుపుని ముందే డిసైడ్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే ఈటలపై భూ కబ్జా అభియోగాలు మోపి టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారో, అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారనే చెప్పాలి. అప్పుడే ఈటల తన నిజాయితీ ఏంటో చాటిచెప్పడం కూడా ఆయన గెలుపుకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా పార్టీ మారిన నేతలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయరు. అలా ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారో చెప్పాల్సిన పనిలేదు. కనీసం విలువలు పాటించకుండా కేసీఆర్…కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు. అలాగే మంత్రి పదవులు కూడా ఇచ్చారు. చెప్పాలంటే ఇది విలువలు లేని రాజకీయం. కానీ ఈటల అలా చేయలేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారో అప్పుడే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు.
ఇక అక్కడే ఈటల ఒక మెట్టు ఎక్కేశారు. అది ఈటల విజయానికి తొలిమెట్టు. అలా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన నిజాయితీ ఏంటో నిరూపించుకున్నారు. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల హుజూరాబాద్ ప్రజలకు ఎంత బెనిఫిట్ అయిందో అందరికీ తెలిసిందే. అంటే కేవలం ఈటల వల్లే…హుజూరాబాద్ ప్రజలకు అనేక వరాలు వచ్చాయి. కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన నిజాయితీ చాటిచెప్పుకున్న ఈటల…మళ్ళీ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమనే ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో?