ఈటెలకు బిగ్ రిలీఫ్… రాజేందర్ పేరులో ఉన్న నామినేషన్ల తిరస్కరణ

హుజూరాబాద్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గత ఆరునెలల నుంచి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 61 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ కూడా ముగిసింది. 18 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అయితే నామినేషన్ల సమయంలో పెద్ద సంఖ్యలో  రాజేందర్ పేర్లతో పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీనే రాజేందర్ పేర్లతో నామినేషన్లను వేయిస్తుందని బీజేపీ విమర్శించింది. 

అయితే తాజాగా నామినేషన్ల పరిశీలన సమయంలో ముగ్గురు రాజేందర్ల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో ప్రస్తుతం బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ బిగ్ రిలీఫ్ దక్కింది. పోలింగ్ సందర్భంగా రాజేందర్ పేర్లతో అభ్యర్థుల సంఖ్య ఎక్కువైతే ఓట్లు నష్టపోయే అవకాశం ఉండేది. దీంతో ఈటెల రాజేందర్ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఏర్పడింది. తాజా పరిణామం ఈటెలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లే.