తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలైన్ లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది ? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గెలుపు తమదే అంటే తమదే అని టీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి.
అయితే ఓ సర్వే సంస్థ మాత్రం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే అని అభిప్రాయపడింది. గతంలో అనేకసార్లు ఎన్నికల ఫలితాలపై సర్వే అంచనాలను వెల్లడించిన ఆరా సంస్థ హుజూర్ నగర్‌లో కూడా సర్వే నిర్వహించింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌కు 50.48 శాతం, కాంగ్రెస్‌కు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు రావొచ్చని సంస్థ అభిప్రాయపడింది. అయితే ఈ సర్వే అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో ఈ నెల 24న తేలిపోనుంది.