కేసీఆర్ వద్దనుకున్నారు.. జగన్ కళ్లకు అద్దుకున్నారు..?

-

ఒకరికి ఇష్టమైంది.. ఇంకొకరికి కష్టమవుతోంది.. ఒకరికి కష్టమైంది.. మరొకరికి ఇష్టమవుతోంది. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లోని విచిత్రమిది. ఓ తెలంగాణ ఐఏఎస్ అధికారిని తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. అంతగా ప్రాధాన్యం లేని పోస్టులో ఏళ్ల తరబడి ఉంచారు. దాంతో ఆయనకు ఉద్యోగంపై విరక్తి పుట్టింది. అందులోనూ ఆయన ప్రజల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి.

అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఆయనే ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ఇప్పుడు అదే అధికారి ఆకునూరి మురళినిఏపీ సీఎం జగన్ కోరి మరీ తన టీమ్ లోకి తీసుకున్నారు. ఒక సామాజిక దృక్పధంతో విద్య,వైద్యం మెరుగుదలకు కృషి చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మురళి సేవలు పొందాలనుకొని, ఏకంగా ప్రభుత్వ సలహాదారుడి పదవి కట్టబెట్టింది.

జగన్ ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా చాలామందిని తీసుకున్నారు. వారితో పోలిస్తే ఆకునూరి మురళి వల్ల ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో గురుకుల విద్యను సుసంపన్నం చేసిన ప్రవీన్‌కుమార్‌లా .. మురళి దూసుకుపోతారని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ ఐఏఎస్ అధికారి నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. మారుమూల ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే ఐఎఎస్‌ అధికారి ఆకునూరి మురళి. పనిలేని చోట కూర్చొని జీతం తీసుకోవడం ఇష్టం లేక, తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఉండననుకున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వం వద్దనుకుంది. మురళి పాలనాధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఏ అంశమైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారని పేరుంది.

ఆకునూరి మురళి.. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ గా ఉన్న సమయంలో కొన్ని వివాద స్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ స్టేట్‌ ఆర్కీవ్స్‌ కార్యదర్శిగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. ఫలితంగా ఆయన స్వచ్చంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news