దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోయి ఉంటే అశుభం కలుగుతుందా..?

-

సాధారణంగా దేవాలయానికి మనం వెళ్లినప్పుడు కొబ్బరికాయలను కచ్చితంగా కొడతాం. దాదాపుగా గుడికి వెళ్లే ప్రతి ఒక్కరు దేవుడికి కొబ్బరికాయలను కొట్టి వాటిని నైవేద్యంగా అర్పిస్తారు. కొబ్బరికాయల్లో ఉండే నీటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకనే కొబ్బరికాయలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇక దేవుడి ముందు మనలోని అహం, ఈర్ష్య, అసూయ, కోపం తదితర గుణాలు మటుమాయం కావాలని కొబ్బరికాయను కొడతారు.

కొబ్బరికాయలకు ఉండే మూడు కళ్లను పరమేశ్వరుడి కళ్లుగా భావిస్తారు. అందుకనే కొబ్బరికాయను కొట్టేముందు దాన్ని బాగా కడగాల్సి ఉంటుంది. ఇక టెంకాయను పెట్టి కొట్టే రాయి ఆగ్నేయ ముఖంగా ఉండాలంటారు. కొందరు కొబ్బరికాయలను కొట్టాక వాటిని విడదీయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా చేయరాదు. వెంటనే కొబ్బరికాయను విడదీసి అందులో ఉన్న నీటిని వేరే పాత్రలో పోసి ఆ రెండు చెక్కలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి.

చాలా మంది టెంకాయ కొట్టగానే అది కుళ్లిపోయి గనక వస్తే దాంతో తమకు అశుభం జరుగుతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. అపనమ్మకమే. ఒక వేళ టెంకాయ కుళ్లిపోయి గనక వస్తే మళ్లీ స్నానం చేసి వచ్చి మళ్లీ ఇంకో కొబ్బరికాయను కొట్టాలి. వాహనాలకు పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టినా ఇదే నియమం వర్తిస్తుంది. వాహనాన్ని మళ్లీ శుభ్రంగా కడిగి, భక్తులు తాము కూడా స్నానం చేసి మళ్లీ ఓ కొత్త కొబ్బరికాయను కొట్టాల్సి ఉంటుంది.

ఇక టెంకాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే కోరిన కోరికలు తీరుతాయట. నూతన వధూవరులకు పువ్వు వస్తే వారికి సంతానం త్వరగా కలుగుతుందని నమ్ముతారు. ఇక కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఆ భక్తుల ఇంట్లో వారికి త్వరగా సంతానం కలుగుతుందని చెబుతారు.

Read more RELATED
Recommended to you

Latest news