కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని ప్రపంచ దేశాలన్నీ ముందు నుంచీ ఆరోపిస్తూ వస్తున్నాయి. వూహాన్ సిటీలోని వైరాలజీ ల్యాబ్‌లో గబ్బిలాలపై చేసిన ప్రయోగాలతో బయటపడ్డ ఆ వైరస్ ల్యాబ్ నుంచి లీకైందని కొందరు అంటుంటే.. కాదు, కాదు.. చైనాయే కావాలని ఆ వైరస్‌ను లీక్ చేసిందని కొందరు ఆరోపిస్తున్నారు. అక్కడి నుంచి ఆ వైరస్ వూహాన్ వెట్ మార్కెట్ ద్వారా బయటకు వచ్చిందని, ఇతర దేశస్థులకు వ్యాప్తి చెందిందనీ.. చైనాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ చైనా ఈ ఆరోపణలు కొట్టి పారేసినా.. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం.. పదే పదే చైనాపై ఈ విషయంలో దాడి చేస్తూనే ఉన్నారు. చైనాలోనే కరోనా వైరస్ పుట్టుందని, అది చైనా వైరస్ అని.. ఆయన చైనాపై దాడిని ముమ్మరం చేశారు.
అయితే ట్రంప్ గతంలో ఏ దేశంపై చేయని విధంగా చైనాపై ఈ సమయంలోనే పెద్ద ఎత్తున మాటల దాడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ట్రంప్ మాటల వెనుక ఏదో అంతర్గత చర్య దాగి ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో బరాక్ ఒబామా అనంతరం 2017లో అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ మరోసారి ఆ పీఠంపై కూర్చోవాలని తహతహలాడుతున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో చైనాపై ఇప్పటి నుంచే మాటల దాడి చేయడం ద్వారా మెజారిటీ అమెరికన్లను మరోసారి తనవైపుకు తిప్పుకుని తద్వారా వచ్చే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడిగా గెలవాలని.. ట్రంప్ చూస్తున్నారని సమాచారం. అందుకనే ఆయన చైనాపై మాటల దాడిని పెంచినట్లు తెలిసింది.
గతంలో ఎన్నికలప్పుడు ట్రంప్ అమెరికా భావాన్ని పైకి తెచ్చి దాంతో ఓట్లు పొంది అధ్యక్షుడిగా గెలిచారు. ఇక ఇప్పుడు కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని అమెరికన్లను బలంగా నమ్మిస్తే.. అందుకు సంబంధించిన ఏవైనా ఆధారాలను చూపించగలిగితే.. మెజారిటీ అమెరికన్లు ఆయన వైపు నిలుస్తారని తెలిసిందట. అందుకనే ట్రంప్ ఆ దిశగా నరుక్కు వస్తున్నారని తెలిసింది. ఇక చైనాలో ఇప్పటికే అనేక అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ కంపెనీలను తిరిగి అమెరికాకు రప్పించాలంటే.. అంతర్జాతీయ సమాఖ్యలో చైనాను దోషిగా నిలబెట్టాల్సిందేనని ట్రంప్ భావిస్తున్నారట. అందుకనే ఆయన చైనాను కరోనా వైరస్‌కు దోషిగా నిరూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అమెరికన్ కంపెనీలు తిరిగి అమెరికాకు వస్తాయని, తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కొంత వరకు మెరుగవుతుందని ట్రంప్ అభిప్రాయం. అందుకనే ట్రంప్ చైనాపై ఈ మధ్య కాలంలో మాటల దాడిని కూడా పెంచారని తెలుస్తోంది.
అయితే నిజంగా కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించినా.. లేదా.. అది అక్కడే పుట్టినా.. ఆ ఆధారాలను ఎప్పుడో మాయం చేశారని తెలిసింది. కనుక చైనాను దోషిగా నిరూపించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. అయితే ఒక వేళ అమెరికా ఆ పని చేయగలిగితే మాత్రం ఆ క్రెడిట్ అంతా ట్రంప్‌కే దక్కుతుంది. దాంతో ఆయన మరోసారి అధ్యక్షుడవడం నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే అది జరుగుతుందా, లేదా అన్నది తేలాలంటే.. మరికొంత కాలం వేచి చూడక తప్పదు..!