ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లపై దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆర్‌బీఐతోపాటు పోలీసులు అలాంటి యాప్‌లపై కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గూగుల్ ఇప్పటికే 100కు పైగా అలాంటి ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఇప్పటికీ పలు యాప్‌లు ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా మరొక యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించారు.
ప్రధాన మంత్రి యోజన లోన్ అనే యాప్ నకిలీ యాప్ అని వెల్లడైంది. అందులో వినియోగదారులకు చెందిన పాన్, ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్ వంటి వివరాలను సేకరిస్తారు. తరువాత ఆ డేటాను హ్యాకర్లకు చేరవేస్తారని గుర్తించారు. దీంతో ఆ యాప్‌ను గూగుల్ తొలగించింది. ఆ యాప్‌కు చెందిన వెబ్‌సైట్ కూడా ఉండడం విశేషం. ఆ వెబ్‌సైట్ కూడా అదేవిధంగా పనిచేస్తుందని గుర్తించారు. అందులో ప్రజలకు చెందిన సమాచారాన్ని సేకరించి దాన్ని హ్యాకర్లకు చేరవేస్తారు. కానీ లోన్ మాత్రం ఇవ్వరు.
కనుక ఇలాంటి యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. లోన్ ఇస్తామని, అందుకు కొంత మొత్తంలో చెల్లించాలని ఎవరైనా అడిగితే స్పందించకూడదని, ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల జోలికి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. కాగా సైబర్ పీస్ ఫౌండేషన్ అనే సంస్థ పైన తెలిపిన యాప్ తాలూకు బండారన్ని బయట పెట్టింది. అందువల్లే గూగుల్ నుంచి ఆ యాప్‌ను తొలగించారు.