కేశినేని వ్యవహారం టీడీపీని ఇరుకున పెట్టిందా ?

Join Our Community
follow manalokam on social media

బెజవాడ కార్పొరేషన్ మేయర్ వ్యవహారంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య తలెత్తిన విబేధాలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి. తన కుమార్తె శ్వేతను కార్పొరేటర్ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారు ఎంపీ కేశినేని. దీంతో ఎన్నికలు జరగకముందే కేశినేని నానికి బెజవాడ టీడీపీ నేతలకు మధ్య తలెత్తిన వైరం ఇప్పుడు పార్టీని మొత్తంగా ఇరకాటంలోకి నెట్టింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం బెజవాడ టీడీపీని కుదిపేస్తోంది.


ఎంపీ కేశినేని నాని చేస్తున్న కామెంట్లతో ఇప్పుడు బెజవాడ నేతలే కాకుండా ఇతర నేతలంతా అసహనంతో ఉన్నారట. శ్వేతను ఆమే మేయర్ అభ్యర్థి అంటూ కేశినేని వర్గం మొదటి నుంచి ప్రచారం ప్రారంభించింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడటంతో ఈ వ్యవహారంపై పెద్దగా రచ్చ జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగటంతో మళ్ళీ మేయర్ అభ్యర్థిపై టీడీపీలో రచ్చమొదలైంది. కేశినేనితో దూరంగా మెలుగుతున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా పశ్చిమ నియోజకవర్గ పార్టీ అభ్యర్థులతో భేటీ నిర్వహించారు. ఇందులో బెజవాడ మేయర్ ను ఇంకా చంద్రబాబు నిర్ణయించలేదని, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అంటూ కేశినేని నానికి షాక్ ఇచ్చారు.

ఇదే సమయంలో నియోజకవర్గ నేతలతో సంబంధంలేకుండా కేశినేని నాని పశ్చిమ పర్యటనకు వెళ్ళారు. నియోజకవర్గ నేతలకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ ఎలా వస్తారనేది బుద్ధా వర్గం వాదన. మరోవైపు ఇదే నియోజకవర్గంలో ఉన్న39వ డివిజన్ లో గతంలోనే పార్టీ తరపున నామినేషన్ వేసిన వారిని మార్చటానికి ఎంపీ సిద్ధమయ్యారని సమాచారం. ఈ నేపధ్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించటానికి ఎంపీ వెళ్ళటంతో బుద్ధా వర్గం అడ్డుకుంది. దీంతో ఎంపీ కేశినేని నాని కూడా ప్రత్యక్ష ఫైట్ కు రెడీ అయ్యారు. తాను ఎవరికీ భయపడనని కావాలంటే క్రమశిక్షణ చర్య తీసుకొమ్మని ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పి వెళ్ళిపోయారు కేశినేని నాని.

పార్లమెంటు పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతే గెలిచిన ఎంపీనని గుర్తు పెట్టుకోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేశినేని. ఓడిపోయిన వారికి నేను చెప్పి వెళ్ళాలా అంటూ పార్టీకి చెందిన ఓడిన మాజీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు నాని. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ సీటు మార్పు, మేయర్ సీటు కోసం మొదలైన ఈ విభేదాలు ఇప్పుడు పార్టీలోఅంతర్గత కుమ్ములాటను రోడ్డుపై పడేశాయనే టాక్‌ నడుస్తోంది. అధిష్టానం రంగంలోకి దిగినా కేశినేని వెనక్కి తగ్గేలా కనిపించటంలేదు. నాని తీరుపై బెజవాడ టీడీపీ నేతలే కాకుండా పార్లమెంటు పరిధిలో ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసహనంతో ఉన్నారట.

ఎన్నికలైన దగ్గరి నుంచి ఎంపీ కేశినేని నానికి నియోజకవర్గ నేతలకు మధ్య ఉన్న గ్యాప్ ఇప్పుడు పూడ్చలేని స్తాయికి వెళ్లిందట. వివిధ కారణాలతో బోండా ఉమ, నాగుల్‌ మీరా మొదలైన నేతలకు దూరమైన పరిస్థితి ఉందనే టాక్‌ ఉంది. అటు జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఉన్నప్పటికీ అక్కడ అన్ని కార్యకలాపాల గురించి అదే నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ ఇన్చార్జి నెట్టెం రఘరాంతో సంప్రదింపులు చేస్తున్నాడట ఎంపీ కేశినేని నాని.

ఇక మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాతో నానికి మొదటి నుంచి విబేధాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో నాని తీరుతో పార్టీకి నష్టం కలుగుతుందని నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కార్పోరేషన్ ఎన్నికలు ముగిసేనాటికి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

TOP STORIES

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు...