ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. వీరి కయ్యాలతో పార్టీకి కూడా నష్టం వాటిల్లుతోందనే చర్చ జరుగుతోంది. ఒకరో ఇద్దరో కాదు.. చాలా మంది మంత్రులు.. ఆయా శాఖల కార్పొరేషన్ల చైర్మన్ల మధ్య ఆధిపత్య పోరుతో కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయట. వీరి ఆదిపత్యపోరు పై అధికార పార్టీలో తీవ్ర చర్చ నడుస్తుంది.
అధికారంలో ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరు సహజం. ఈ ఆధిపత్యపోరు శ్రుతి మించనంత వరకు పర్వాలేదు. కానీ.. తెలంగాణలోని మంత్రులు.. కొందరు కార్పొరేషన్ చైర్మన్ల మధ్య అస్సలు పొసగడం లేదు. బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు సివిల్ సప్లయ్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డికి మధ్య సమన్వయం లేదని ఆ శాఖ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మంత్రి గంగుల చేసే అడపాదడపా సమీక్షలకు కార్పొరేషన్ చైర్మన్‌కు పిలుపే ఉండటం లేదు. మంత్రి గంగుల మొదటి నుండి అంటి ముట్టనట్టు వ్యవహరించడం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందట. తాజాగా వానాకాలం పంటల సమీక్షలు నిర్వహిస్తున్నారు మారెడ్డి. ఒకే అంశంపై ఇద్దరు వేర్వేరుగా సమీక్షలు చేస్తూ.. ప్రభుత్వ పాలసీలను ఒకరు ఒకరకంగా మరొకరు దానికి విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారు.
హోం మంత్రి మహమూద్ అలీకి పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దామోదర్ గుప్తకు మధ్య సత్సంబంధాలు లేవు. దామోదర్ గుప్తను హోంమంత్రి సమావేశాలకు పిలిచిన దాఖలాలు కూడా లేవు. ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తకు మధ్య బేధాభిప్రాయాలు లేకపోయినా… ఎవరి సమీక్షలు వారే నిర్వహిస్తున్నారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. మంత్రుల పర్యటనల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేషన్ చైర్మన్లకు సమాచారం ఉండటం లేదట. ఇదే విషయాన్ని అనుచరులతో చెప్పుకుని మదనపడుతున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డికి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డికి మధ్య ఎక్కడ సమన్వయం లేదు. పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డికి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి తలసాని విజయ డెయిరీకి సంబంధించిన రివ్యూలు పెట్టినా.. భూమారెడ్డిని పిలవడం లేదట. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ పై అనేక సమీక్షలు చేస్తున్నారు. కానీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డిని పిలవడం లేదట. ఒంటేరు కూడా చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెబుతున్నారు.
ఇలా మంత్రులు, చైర్మన్ల మధ్య జరుగుతున్న వ్యవహారాలు కొంత మేరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నామినేటెడ్ పదవులు పేరుకే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారట. కలిసి సాగాల్సిన చోట ఎడముఖం పెడముఖంగా ఉండటం పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. మరి.. ఈ గ్యాప్ పూడ్చేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.