సకల కార్యజయానికి సుందరకాండ పారాయణం !

-

మీకు చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయా? సంతానం కోసం చూస్తున్నారా? ఈతిబాధలు, రుణవిమోచనం కోసం కష్టపడుతున్నారా మీ సమస్యలన్నింటికి సమాధానం సుందరకాండ. అసలు దీనిగురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం…

రామాయణం అంటే తెలియని భారతీయుడు ఉండరు. అలాంటి దివ్య ఇతిహాసంలో అత్యంత ప్రధానమైన కాండ సుందరకాండ. ఇది ఒక జరిగిన కథే కాదు. దీనిలో ప్రతి ఘట్టం సకల దోష నివారణకు దివ్యౌషధం. అలాంటి సుందరకాండ అంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. హనుమంతుడు సీతామాతను కలవడం, రావణ లంకను చూడటం, సీతజాడను రాముడికి చెప్పడటమే కాదు రామయణాన్ని సంక్షిప్తంగా పూర్తిగా చెప్పిన కాండ కూడా ఇదే కావడం విశేషం. మహాభారతంలో భగవద్గీత, రామాయణంలో సుందరకాండ నిత్యపారాయణ గ్రంథాలన్న భావన లోకంలో ఉంది. ఎవరు చెప్పినా ఈ రెండింటి గురించీ చెబుతుంటారు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. వాల్మీకి మహర్షి అన్నికాండల్లోనూ ఫలశ్రుతి చెప్పారు. ఈ కాండలో మాత్రం కాండ ఫలశ్రుతితో బాటు కొన్ని ముఖ్య ఘట్టాల్లోనూ ఫలశ్రుతిని చెప్పారు. సుందరకాండ విశేషం గురించి కింది శ్లోకాన్ని పరిశీలిద్దాం…

సుందరే సుందరో రామః సుందరే సుందరీకథా
సుందరే సుందరీ సీతా సుందరే వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కింన సుందరమ్

శ్రీమద్రామాయణంలోని సుందర కాండ గురించిన సుప్రసిద్ధ చెందిన శ్లోకమిది. వాల్మీకి రామాయణంలో సుందరకాండకే ఎందుకు అంత ప్రాముఖ్యముందనే ప్రశ్నకు సమాధానమీ శ్లోకం. సుందరకాండలో వర్ణించిన శ్రీరామచంద్రుడు పరమ సుందరుడు, అందులోని కథ పరమ సుందరం, సీతాదేవి పరమ సుందరి, ఆమె ఉన్న వనం పరమ సుందరమైనది, కావ్యం మరింత సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, మంత్రం కూడా సుందరమే. ఈ కాండలో సుందరం కానిది ఏమున్నది? అని శ్లోకార్థం. సుందరకాండ ఫలశ్రుతిని గురించి రామాయణమేగాక, స్కాందపురాణం బ్రహ్మాండ పురాణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోను కనిపించడం దీని వైశిష్ట్యాన్ని చెబుతున్నది. వీటిని పరిశీలించి చూస్తే వాల్మీకి ఈ కాండం నుంచి నేటి సమాజానికి కూడా పనికి వచ్చే పరమాద్భుతమైన ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడనిపిస్తుంది.

సుందర కాండలో హనుమంతుడే కథానాయకుడు. రామాయణంలోని ప్రతికాండలోనూ శ్రీరాముని ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఇందులో చివర్లో మాత్రమే రామచంద్రుడు కనిపిస్తాడు. కానీ కథంతా శ్రీరామ కార్యసాధనతో ముడిపడి ఉంటుంది. సీతాన్వేషణ నిమిత్తం బయల్దేరిన వానర వీరుల్లో దక్షిణ దిశగా పయనించిన అంగద, జాంబవంత, హనుమంతాది మహావీరులు కార్యసాధన చేసుకొని తిరిగి రాగలరన్న విశ్వాసం రామునిలో పుష్కలంగా ఉంది. ముఖ్యంగా హనుమంతునిపై మరింత నమ్మకముంది గనుకనే అంగుళీయకం హనుమకే ఇచ్చాడు. స్వామి కార్యనిర్వహణ ఎంత దుస్తరమైనదైనా ఫలవంతం చెయ్యాలన్న పట్టుదల ఉండాలన్నది హనుమంతుని ద్వారా రామాయణం మనకు చెబుతున్నది. అలాగే.. తాను ఎవరి పక్షాన వచ్చాడో అతని శక్తి ఎంతటిదో చెప్పి శత్రువును హెచ్చరించే స్థాయిని ఈ కాండలోనే మనం చూడగలం. చంపదలచి తోకకు నిప్పంటించినప్పుడడుఉ అదే నిప్పుతో లంకా దహనం చేసి తమ విజయం తథ్యమన్న సంకేతాన్నివ్వడమే గాక, రామాయణంలోని ముఖ్య ఘట్టమైన రావణ వధ, రాక్షస వినాశనం కూడా జరిగి తీరుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన కార్యశీలి హనుమంతుడు. మహా కార్యనిర్వహణ చేయడం గురించి అడుగడుగునా తెలిపే సుందరకాండం నిత్యపారాయణ యోగ్యమనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

importance of sundarakanda parayanam

ముఖ్యంగా కార్యజయం, చదువులో అత్యున్నత స్థానానికి ఎదగాలనుకునేవారు, వివాహం కానివారు, సంతాన ప్రాప్తి, నవగ్రహదోషాలు, అనారోగ్య సమ్యలు, ఆర్థిక బాధలు, ఈతి బాధలు, కుటుంబ సమస్యలు, ఇలా రకరకాల సమస్యలకు సుందరకాండ పరమౌషధం అని పండితుల అభిప్రాయం. మీకు దగ్గర్లోని సుందరకాండ పారాయణం చేసే పండితుల దగ్గరకు వెళ్లి మీ సమస్యలకు పరిష్కారాన్ని సుందరకాండ పారాయణంతో చేసుకోండి. పారాయణం చేయించుకోవడం ఇబ్బంది ఉంటే సుందరకాండ పుస్తకాన్ని కొనుక్కొని ప్రతీరోజు ఒక పుష్పం దానిపై ఉంచి ప్రార్థన చేసినా మీకు తప్పక మంచి జరుగుతుందని శాస్త్రవచనం. ఇక ఆలస్యమెందుకు అన్ని బాధలు తీరడానికి భక్తితో, శ్రద్ధతో సుందరకాండ పారాయణం చేయండి. సకల శుభాలను పొందండి. జై హనుమాన్!

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news