ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగం ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుకు గాను మరోసారి గడువు పెంచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను నవంబర్ 30వ తేదీ వరకు ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతంలో జూలై 31, అక్టోబర్ 31వ తేదీల వరకు ఈ గడువు ఉండేది. కానీ కొత్త తేదీ ప్రకారం ఇక ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుకు ఖాతాదారులకు నవంబర్ 30వ తేదీ వరకు గడువు లభించింది.
ఇక ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు గాను ఖాతాదారులు జూలై 31వ తేదీ వరకు పెట్టుబడులు పెట్టుకునేందుకు కూడా గడువును పొడిగించారు. దీంతో ఆ లోపు వారు ట్యాక్స్ రిటర్న్స్‌లో చూపించదలచిన పన్ను మినహాయింపులకు గాను పెట్టుబడులు పెట్టవచ్చు. వారు 80సి సెక్షన్ కింద ఎల్‌ఐసీ, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్) వంటి పొదుపు స్కీంలలో పెట్టుబడులు పెట్టి ఆ మేర ట్యాక్స్ రిటర్న్స్‌లో మినహాయింపులు పొందవచ్చు.
అలాగే టీడీఎస్, టీసీఎస్ స్టేట్‌మెంట్ల వివరాలను సమర్పించేందుకు, ఆ సర్టిఫికెట్‌లను పొందేందుకు ఆగస్టు 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగం తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పన్ను చెల్లింపు దారులకు నెలకొన్న ఆర్థిక సమస్యల దృష్ట్యా ఆయా గడువు తేదీలను పొడిగిస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది.