ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి 32 టోల్‌గేట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్స్ మళ్లీ పెంచతున్నారని తెలిసిన విషయమే….కాగా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే కేంద్రం వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ తెలంగాణ ప్రజలకు పెనుభారంగా మారింది. టోల్ ట్యాక్స్ పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మళ్లీ టోల్ ట్యాక్స్ పెంచితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా అవుతుంది. 2014లో రూ. 600 కోట్లు టోల్ ట్యాక్స్ వసూలు చేశారు. ఆ తర్వాత ప్రతి ఏడాది పెంచుకుంటూ పోయారు. 2023 నాటికి రూ. 1824 కోట్ల టోల్ ట్యాక్స్ వసూలు చేశారు. ఈ 9 ఏండ్లలోనే టోల్ ట్యాక్స్ 300 శాతం పెంచడంతో.. నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు టోల్ ట్యాక్స్ పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన తెలిపారు.