సౌత్ ఆఫ్రికా తో తొలి టి20 ఓటమికి తాత్కాలిక సారథి రిషబ్ పంత్ తప్పిదం లేదని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. బౌలింగ్ వైఫల్యమే జట్టు ఓటమికి కారణమైందని, కానీ ఆరోజు తమకు కలిసి రాలేదు అన్నాడు. రిషబ్ పంత్ యువ క్రికెటర్ అని, తాను సిరీస్ సాగుతున్నా కొద్దీ నేర్చుకుంటాడు అని చెప్పాడు. ఇక ఐదు టీ20 ల సిరీస్ లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భూవీ.. పంత్ ని వెనకేసుకొచ్చాడు.” రిషబ్ పంత్ కుర్రాడు. సౌత్ ఆఫ్రికాతో తొలి టీ-20 కెప్టెన్ గా అతనికి ఫస్ట్ మ్యాచ్. సిరీస్ సాగుతున్నా కొద్దీ రిషబ్ మెరుగవుతాడని భావిస్తున్నా.. సౌత్ ఆఫ్రికా టి20 లో భారత్ బౌలర్లు అందరూ విఫలమయ్యారు. ఒకవేళ బౌలర్లు రాణించి ఉంటే పంత్ నిర్ణయాలను మెచ్చుకునేవాళ్లే. అతను భవిష్యత్తులో కెప్టెన్ గా సత్తా చాటుతాడని భువనేశ్వర్ ధీమా వ్యక్తం చేశాడు.