తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ నుంచి చైనా- భారత్ బలగాలు వెనక్కి మళ్లాయి. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్ పాయింట్ (పీపీ)-15 నుంచి భారత్, చైనా బలగాలు వెనుదిరిగిన బలగాలు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు పక్షాలూ ఈ ప్రక్రియను చేపట్టాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పీపీ-15 నుంచి రెండు దేశాల సైనికుల ఉపసంహరణ జరిగినా దెమ్‌చోక్, దెప్సాంగ్ ప్రాంతాల్లో వివాదాలను పరిష్కరించుకునే అంశంలో ఎలాంటి పురోగతి లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి బలగాల ఉపసంహరిస్తున్నట్లు భారత్-చైనా ఇటీవలే ప్రకటించాయి. సైనిక కమాండర్ల మధ్య జులై 17న జరిగిన 16వ విడత చర్చల సందర్భంగా దీనిపై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇరుదేశాల సైన్యాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సమన్వయం, ప్రణాళికబద్ధంగా ఇరుదేశాల బలగాల ఉపసంహరణతో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొన్నాయి.
2020 జూన్‌లో జరిగిన గల్వాన్ ఘటన అనంతరం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో అక్కడ శాంతియుత వాతావరణాన్ని తెచ్చేందుకు భారత్-చైనా సైనికాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల 16వ విడతలో భాగంగా మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరిపారు. ఇలా ఇప్పటివరకు జరిపిన సంప్రదింపుల ఫలితంగా పాంగాంగ్ సరస్సు, గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17న జరిగిన చర్చల ఫలితంగా గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ నుంచి బలగాలు వైదొలిగాయి. దీంతో సరిహద్దులో శాంతి నెలకొంటుందని ఇరుదేశాల సైనికాధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.