అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు విపరీతంగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే భారత్ ఈ విషయాన్ని క్యాష్ చేసుకుంటోంది. పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేసి నిల్వ చేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ప్రకారం.. ముడి చమురు ధరలు చాలా తక్కువగా ఉన్న ఈ సమయంలోనే దాన్ని కొని భారత్ పెద్ద ఎత్తున నిల్వ చేస్తోంది. ఇప్పటికే 32 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ కొనుగోలు చేసి నిల్వ చేసింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వివరాలను వెల్లడించారు.
ప్రపంచంలో క్రూడ్ ఆయిల్‌ను అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. దేశంలో అవసరం ఉన్న మొత్తం ఆయిల్‌లో 85 శాతం ఆయిల్‌ను మనం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ బాగా తగ్గింది. దీంతో ప్రపంచంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయ స్థాయికి ముడిచమురు ధరలు పడిపోయాయి. ఓ దశలో ఆయిల్ ధరలు మైనస్‌లలోకి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే భారత్ తొందరపడింది. ధరలు తక్కువగా ఉన్న ఈ సమయంలోనే పెద్ద ఎత్తున ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది.
సౌదీ అరేబియా నుంచి అదనంగా కొనుగోలు చేసిన 5.33 మిలియన్ టన్నుల ఆయిల్‌ను భూగర్భ స్టోరేజ్ రిజర్వ్‌లలో భారత్ స్టోర్ చేసింది. అలాగే వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయించింది. ఇక మరో 7 మిలియన్ టన్నుల ఆయిల్‌ను షిప్పుల్లో నిల్వ చేశారు. మరో 25 మిలియన్ టన్నుల ఆయిల్‌ను ఇన్‌ల్యాండ్ డిపోలు, ట్యాంకులు, రిఫైనరీ పైప్‌లైన్లలో నిల్వ చేశారు. కాగా ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 20 డాలర్ల కన్నా తక్కువగానే నమోదవుతోంది.