న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా మరోసారి ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు మన బ్యాట్స్మెన్. తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిన టీం ఇండియా రెండో ఇన్నింగ్స్ లో కూడా తడబడింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీం ఇండియాకు ఆదిలోనే కివీస్ బౌలర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.
26 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి నిలబడ్డాడు అనుకున్న తరుణంలో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే రహానే కూడా అవుట్ అవ్వడం, వెంట వెంటనే పూజారా, నైట్ వాచ్ మెన్ ఉమేష్ యాదవ్ వెనుతిరగడతో 89 పరుగులకే భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక కెప్టెన్ కోహ్లీ ఆట తీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి.
జట్టుకి కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రభావం చూపించలేకపోయాడు కోహ్లీ. దీనితో సోషల్ మీడియాలో అతన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం విహారి, పంత్ క్రీజ్ లో ఉన్నారు. వీరు గనుక నిలబడకపోతే మాత్రం జట్టు ఓటమి దాదాపుగా ఖాయం. కాగా తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో శమీ నాలుగు వికెట్లు తీసి వికెట్ల పతనాన్ని శాసించాడు.