రెండో టీ20లో ఇంగ్లండ్‌పై నెగ్గిన భారత్‌.. అలవోకగా విజయం..

-

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లి సహా ఇతర బ్యాట్స్‌మెన్‌ కూడా చక్కగా రాణించారు. దీంతో ఇంగ్లండ్‌పై భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

india won against england in 2nd t20 at ahmedabad

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌ చేయగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. ఈ క్రమంలో ఇంగ్లిష్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ రాణించాడు. 35 బంతులు ఆడిన రాయ్‌ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో సుందర్‌, ఠాకూర్‌లకు చెరో 2 వికెట్లు దక్కగా, భువనేశ్వర్‌ కుమార్‌, చాహల్‌లు చెరో వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్‌ కోహ్లి, ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌లు అద్భుతంగా రాణించారు. 49 బంతులు ఆడిన కోహ్లి 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా కిషన్‌ 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. కిషన్‌కు ఇది తొలి టీ20 ఇంటర్నేషనల్‌ కావడం విశేషం. ఇంగ్లండ్‌ బౌలర్లలో శామ్‌ కుర్రాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, ఆదిల్‌ రషీద్‌లకు తలా ఒక వికెట్‌ దక్కింది. రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్‌ 5 టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తదుపరి టీ20 మ్యాచ్‌ ఇదే వేదికపై ఈ నెల 16వ తేదీన జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news