భారత్ పాక్ సరిహద్దుల్లో… నియంత్రణ రేఖ వెంట భీంబర్ సెక్టార్ లో పాకిస్తాన్ ఆర్మీ స్నిపర్ ను భారత సైన్యం కాల్చిపారేసింది. స్నిపర్ ను గుర్తించడానికి అలాగే అతన్ని కాల్చి చంపడానికి మన సైన్యం అత్యాధునిక థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించిందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ స్నిపర్ బుల్లెట్ తగిలి నేలమీద పడటం కనిపించే ఫుటేజీని జాతీయ మీడియా విడుదల చేసింది. అక్టోబర్ లో ఈ ఆపరేషన్ జరిగిందని పేర్కొంది.
భారత ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం… పాక్ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడటానికి పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంట స్నిపర్లను భారీగా మోహరించింది. కానీ ఫార్వర్డ్ లొకేషన్లలో నిలబడిన భారతీయ జవాన్లు మాత్రం వారిని బలంగానే అడ్డుకున్నారు. పాక్ స్నైపర్ పై కాల్పులు జరపడానికి మన జవాన్లు సాకో టిఆర్జి 42 స్నిపర్ రైఫిల్ ను ఉపయోగించారు. రైఫిల్ 1200 మీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాన్ని కూడా చేధిస్తుంది. నైట్ విజన్ కెమెరాను కూడా ఇందులో ఉపయోగించారు.