పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం…

-

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికై రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు-2016కు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఆయా దేశాల నుంచి  అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీవ్ర నిరసనలు అందోళనలు చేపట్టిన  విషయం తెలిసిందే. ఈ  బిల్లును హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. భారత దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా వారికి పౌరసత్వం ఇవ్వాలి…ఇందులో భాగంగా ముస్లింలను కూడా చేర్చాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) డిమాండ్ చేసింది. ఈ బిల్లును భాజపా  మిత్రపక్షాలు సైతం తప్పుబట్టాయి. బిల్లును వ్యతిరేకిస్తూ అసోం గణ పరిషద్ (ఏజీపీ) బీజేపీతో కలిసి ఇటీవలే ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి వైదొలిగింది. అసోంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం జరుగుతున్నాయి.  బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..

‘పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో మైనార్టీలు తీవ్ర హింసను ఎదుర్కొంటున్నారు. వారంతా ఆశ్రయం కోసం భారత్‌ వైపు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం అసోం రాష్ట్రం కోసం కాదు. పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే శరణార్థుల అందరి కోసం. పశ్చిమ సరిహద్దుల నుంచి కూడా చాలా మంది శరణార్థులు రాజస్థాన్‌, పంజాబ్‌, దిల్లీ లాంటి రాష్ట్రాలకు వస్తున్నారు. ఆ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించడం కోసమే ఈ బిల్లును తీసుకొచ్చాం’ అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news