హైదరాబాద్ : కరోనా మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా ఈ నెల 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లోనూ విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా ముందుకు సాగుతోంది. అయితే, పలువురు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తూ.. టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రభుత్వ అధికారులు, నేతలు వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కరోనా టీకాపై మాట్లాడుతూ.. దేశంలో ప్రజలకు అందిస్తున్న రెండు టీకాలు సురక్షితమైనవేననీ, అనుమానాలు అక్కర్లేదని పేర్కొన్నారు.
సోమవారం తమిళి సై హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అందిస్తున్న కరోనా టీకా సరక్షితమైనవేననీ, అపోహలు నమ్మవద్దని విజ్ఙప్తి చేశారు. ప్రభుత్వం టీకా అందించడానికి వస్తే.. భయపడకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, తాను సాధారణ పౌరురాలినేనీ, సాధారణ పౌరులకు టీకా అందుబాటులోకి వచ్చాక తాను కూడా తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.