కోర్టు తీర్పు..ఎస్ఈసీ దూకుడుతో స్థానిక ఎన్నికలకు టీడీపీ కాలు దువ్వుతుంటే ఆ జిల్లాలో మాత్రం తెలుగు తమ్ముళ్లు సైలెంటయ్యారట..ఎన్నికలంటూ కేడర్ ఉరకలేస్తున్నా హా ఏముందిలే అని సైడ్ అవుతున్నారట నియోజకవర్గ ఇంచార్జులు..ముందుండి నడిపించే నాయకులు కాడి జారేయ్యడంతో డైలమాలో పడ్డారు ప్రకాశం జిల్లా తెలుగు తమ్ముళ్లు.
పంచాయతీ ఎన్నికల విషయంలో అధికారపార్టీతో ఢీ అంటే ఢీ అనేందుకు టీడీపీ అధిష్ఠానం సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం దానికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రమంతా ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తే.. ప్రకాశం జిల్లాలో మాత్రం ఆ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో సైలెంట్ అయ్యారు జిల్లా టీడీపీ అగ్ర నేతలు.గెలిచినవాళ్లలో సైతం కొందరు అధికారపార్టీ గూటిలోకి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఓవైపు పంచాయితీ ఎన్నికల వేడి ఉంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గాల్లో పార్టీని లీడ్ తీసుకుని నడిపించేవారు కరువయ్యారు.
ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. ఆరుచోట్ల టీడీపీకి ఇంఛార్జులు లేరు. ఒంగోలు ఇంఛార్జ్ దామచర్ల జనార్దన్ అస్సలు పట్టించుకోవడం లేదట. సంతనూతలపాడులోనూ పరిస్థితి ఇలానే ఉందట. ఇక్కడి పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బిఎన్.విజయ్ కుమార్ కనిపించడం లేదంటోంది కేడర్. ఎర్రగొండపాలెం ఇంఛార్జ్ బూదాల అజితారావు కూడా నియోజకవర్గంతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఓడిన అజితారావు తిరిగి వస్తారా..రారా అన్న సందేహం ఉంది. ప్రత్యామ్నాయంగా డేవిడ్ రాజుకి బాధ్యతలు అప్పగిద్దామన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం.
కందుకూరు ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పోతల రామారావు లోకల్‌గానే ఉంటోన్నా..పార్టీని పట్టించుకోవడం లేదని సమాచారం. టీడీపీతో సంబంధమే లేదన్నట్టుగా ఆయన తీరు ఉందట. దర్శి ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామ్ వైసీపీకి జై కొట్టారు. మరో టీడీపీ నేత యడం బాలాజీని పార్టీ వ్యవహారాలు చూసుకోమని చెప్పినా.. ఆయన లైట్ తీసుకున్నారట. ప్రస్తుతం నియోజకవర్గాల్లో లీడర్లు లేక పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీని ఎలా ఎదుర్కోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట పార్టీ శ్రేణులు.
జిల్లాలో టీడీపీ పరిస్థితి అధిష్ఠానం దృష్టిలో ఉన్నా.. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటుందా అన్నది డౌటేనట. కేడర్ లో ఊపు ఉన్నా నేతల్లో చూరుకు లేకపోవడంతో పక్క చూపులు చూస్తుందట పార్టీ కేడర్.