వరుస భూకంపాలతో అతలాకుతలమవుతున్న టర్కీ, సిరియా దేశాల పరిస్థితిపై ప్రపంచ దేశాలు సానుభూతి చూపిస్తున్నాయి. అంతే కాకుండా తమకు తోచిన సాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాలకు ప్రత్యేక బృందాలను పంపాలని అధికారులను ఆదేశించారు.
టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్‌కు చెందిన తొలి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్ అధికారులు ఉన్నారు. వారితోపాటు రక్షణ చర్యల్లో తర్ఫీదు పొందిన డాగ్ స్క్వాడ్‌ను కూడా టర్కీకి చేరవేశారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన సామగ్రిని కూడా వారితో పంపించారు.
యాభై మందితో కూడిన తొలి NDRF బృందాన్ని భారత వాయుసేకు చెందిన సీ17 విమానం టుర్కియేకు చేరవేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాకు వెల్లడించారు. ఇవాళ ఉదయం దిల్లీ నుంచి మరో NDRF బృందం కూడా టర్కీకి బయల్దేరింది.