కరోనాపై పోరాటం చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రత్యేక హాస్పిటళ్లు, ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు అనేక రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లకు అత్యవసర చికిత్స అందించేందుకు కావల్సిన ఐసీయూ యూనిట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక భారతీయ రైల్వే ఇప్పటికే పలు నాన్ ఏసీ కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా తీర్చిదిద్దింది. దీంతో వాటిలో ప్రస్తుతం 16 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని కోచ్‌లను ఆస్పత్రులుగా మార్చాలని రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా నేపథ్యంలో రోగులకు చికిత్స అందించేందుకు గాను 20వేల కోచ్‌లకు మార్పులు, చేర్పులు చేసి మొత్తం 3.20 లక్షల ఐసొలేషన్ బెడ్స్‌ను రైల్వే శాఖ సిద్ధం చేయనుంది. ఇక తెలంగాణకు ఈ బెడ్స్ అధికంగా అందుబాటులోకి రానున్నాయి. వీటిని క్వారంటైన్ లేదా ఐసొలేషన్ వార్డులుగా ఉపయోగించుకోవచ్చు. కాగా దేశంలో మొత్తం 16 రైల్వే జోన్లు ఉండగా.. ఏయే జోన్‌లలో ఎన్ని కోచ్‌లను ఐసొలేషన్, క్వారంటైన్ వార్డులుగా మార్చనున్నామనే విషయాన్ని కూడా ఇప్పటికే రైల్వే శాఖ వెల్లడించింది.
తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే ఉండగా.. ఈ జోన్ పరిధిలో 486 కోచ్‌లు.. అంటే.. 7,776 ఐసొలేషన్ బెడ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక ముంబై కేంద్రంగా సెంట్రల్ రైల్వే ఉండగా.. ఈ జోన్ పరిధిలో 482 కోచ్‌లు.. అంటే.. 7,712 వార్డులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇప్పటికే 5వేల కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక నాన్ ఏసీ కోచ్‌లో మొత్తం 9 కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. 4 మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో రెండింటిని బాత్‌రూమ్‌లుగా తీర్చిదిద్దారు. ఇక ప్రతి క్యాబిన్‌లోనూ 6 బెర్తులు ఉంటాయి. అలాంటి క్యాబిన్లు 10 ఉంటాయి.
ఇక రైల్వే శాఖ రూపొందించే వార్డులలో రోగులకు, వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా క్యాబిన్లను ఇస్తారు. అలాగే ప్రతి కంపార్ట్‌మెంట్‌ను అవసరం అయితే ఒక క్యూబికల్‌గా మార్చనున్నారు. ఈ క్రమంలో ఒక కంపార్ట్‌మెంట్‌ను అవసరం అయితే వైద్య సిబ్బంది కోసం నర్సింగ్ స్టేషన్‌గా కూడా మార్చనున్నారు. అయితే కేవలం కొద్ది పాటి మార్పులతో ప్రతి కోచ్‌లోనూ 8 మంది రోగులకు చికిత్స అందించే విధంగా కోచ్‌లను మార్చవచ్చని రైల్వే శాఖ తెలియజేసింది. కాగా కరోనా రోగుల క్యాబిన్‌ను తయారు చేసేందుకు ఒక వైపు ఉండే మిడిల్ బెర్త్‌తోపాటు మరో వైపు ఉండే మూడు బెర్తులు, ల్యాడర్స్ తొలగించారు. ఇక ప్రతి క్యాబిన్‌కు ప్లాస్టిక్ కర్టెన్లను అమర్చారు. డాక్టర్, నర్స్, ఇతర వైద్య సిబ్బందికి క్యాబిన్‌లో ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ప్రతి కంపార్ట్‌మెంట్‌కు 220 వోల్టుల ఎలక్ట్రిక్ పాయింట్‌ను ఇస్తున్నారు. దీంతో రైల్వే కోచ్‌లు ఐసొలేషన్, క్వారంటైన్ వార్డులుగా మారనున్నాయి..!