సోషల్ మీడియా! అది ఫేస్‌బుక్ కావొచ్చు.. వాట్సాప్ కావొచ్చు.. ట్విట్టర్ అయినా ఓకే.. ప్రధాన ఉద్దేశం.. ఒకరికి ఒకరు సరైన సమయానికి సరైన విధంగా సందేశాలు పంచుకునే, పంపుకునే ఓ కీలక సాధనం. నిజానికి పెరుగుతున్న జనాభాకు సోషల్ మీడియా అందిరావడం ఓ అద్భుత వరంగా నే చెప్పారు. ఎందుకంటే.. ఎవరు ఎక్కడ ఉన్నా.. తన వారికి అనేక రూపాల్లో సందేశాలను పంపుకునేందుకు, తమ మనసులోని మాటలను పంచుకునేందుకు ఇది గొప్ప సాధనం కనుక! అయితే, రాను రాను సోషల్ మీడి యా వివాదాలకు, విమర్శలకు ప్రధాన మార్గంగా మారిపోయింది.
కుల, మత, జాతులను అవమానించుకోడానికి, అనవసర విషయాలపై రాద్ధాంతాలు చేసుకునేందుకు, ఒ కరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేందుకు, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనే వితండ వాదాలు చేసుకు నేందుకు ఈ సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. దీంతో మొదటలో ఈ సోషల్ మీడియాకు ఉన్న ప్రాదాన్యం ఇప్పుడు లేకుండా పోయింది. అంటే.. ప్రాధాన్యం ఉంది.. విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారి పోయింది. అనవరసమైన అంశాలను జోడించడం, అక్కరలేని వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది. దీంతో సోషల్ మీడియాలో వచ్చే అంశాలు, వార్తలకు ప్రాధాన్యం తగ్గిపోయింది.
ఇక, ఇప్పుడు జరుగుతున్న కరోనా లాక్‌డౌన్ సహా, కరోనా మహమ్మారిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని కోట్ల సందేశాలు, వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వచ్చాయి. అయితే, వీటిలో విశ్వసనీ యత ఎంత? అంటే మాత్రం నేతిబీరలో నెయ్యంత! అనే నానుడి గుర్తుకు వస్తోంది. అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక.. అనే సంస్కృతి పెచ్చరిల్లిపోయింది. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులు ప్రజల్లో భయాందోళనలకు కారణం అవుతున్నాయి. కరోనా విషయంలో జరుగుతున్న ప్రచారం.. వ్యక్తుల ప్రాణాల మీదకు కూడా తెస్తోంది. పసుపుతో కరోనా కట్టడి అవుతుందని, ఓ గంట పాటు ఎండలో ఉంటే కరోనా చచ్చిపోతుందని, కరివేపాకు తింటే కరోనా రాదని ఇలా అర్ధం లేని ప్రచారం జోరందుకుంది.
ఇక, ప్రభుత్వాలపైనా విమర్శలు సర్వసాధారణంగా మారుతున్నాయి. అన్నింటికీ మించి ప్రస్తుతం మద్యం లభించడం లేదు. దీంతో ఏవేవో ఇంట్లో లభించే స్పిరిట్‌లను అంటే యాసిడ్, బ్లీచింగ్ వంటివాటిని కలుపుకుని రసాయనంగా చేసుకుని తాగితే.. మద్యాన్ని మించిన మత్తు వస్తుందని జరుగుతున్న ప్రచారంతో యువకులు ఈ ప్రయోగాలు చేసి మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మరి ప్రజలకు ఎంతో ఉపయోగకారిగా ఉన్న సోషల్ మీడియాను ఇలా వాడేసుకోవడం ఏమేరకు అవసరం? అనేది ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే వాట్సాప్‌కు కొన్ని నిబంధనలు రానున్నాయని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.