కరోనా టెస్టులు చేసేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు రకాల టెస్టు పరికరాలను వాడుతున్న సంగతి తెలిసిందే. ర్యాపిడ్ యాటీ జెన్ టెస్టు ద్వారా 30 నిమిషాల్లో ఫలితం వస్తుంది. ఆర్టీ పీసీఆర్ టెస్టు ద్వారా ఫలితం వచ్చేందుకు కొన్ని గంటల వ్యవధి నుంచి రోజుల వ్యవధి వరకు సమయం పడుతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ తయారు చేసిన కోవిడ్ టెస్టు కిట్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది.
ఢిల్లీకి చెందిన ఆస్కార్ మెడికేర్ నూతనంగా ర్యాపిడ్ కోవిడ్ 19 యాంటీ బాడీ టెస్టింగ్ కిట్‌ను రూపొందించింది. భారత్‌కు చెందిన తొలి కోవిడ్ 19 టెస్ట్ కిట్ ఇదే కావడం విశేషం. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే కోవిడ్ టెస్ట్ ఫలితం వస్తుందని ఆస్కార్ మెడికేర్ సీఈవో ఆనంద్ శేఖ్రి తెలిపారు. ఈ టెస్ట్ కిట్ ధరను రూ.200గా నిర్ణయించామన్నారు.
తమ కంపెనీ నిత్యం 5 లక్షల టెస్ట్ కిట్‌లను ఉత్పత్తి చేయగలని ఆనంద్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కిట్‌ను అనేక రాష్ట్రాలకు సరఫరా చేయనున్నామని వివరించారు. ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కన్నా ఈ కిట్ వల్ల ఫలితం కచ్చితత్వంతో వస్తుందని అన్నారు. కాగా ఆస్కార్ మెడికేర్ రూపొందించిన ఈ కిట్‌ను ఐసీఎంఆర్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కిట్లు సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.