శ్రీరామనవి వేడుకల్లో జరిగిన అపశ్రుతితో 14 మంది మృతి చెందిన విషాదకర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందౌర్‌లోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలి అందులో భక్తులు పడిపోయారు. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్న మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడుక చూసేందుకు కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొంతమందిని నిచ్చెన సాయంతో పైకి తీసుకొచ్చారు. మరికొంత మందిని కాపాడటానికి ప్రయత్నించినా అప్పటికే వారు మృతి చెందారు.
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి పరిహారంగా రూ.50 వేలు అందిస్తామని చెప్పారు.