దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి పొందిన భద్రాచలంలో జగదభిరామయ్య, సీతాదేవి కల్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతోంది. మిథిలా ప్రాంగణంలో వేలాది మంది భక్తుల మధ్య సీతారాముల వివాహం కన్నులపండువగా సాగుతోంది. అర్చకులు అత్యంత నిష్ఠతో కల్యాణం నిర్వహిస్తుండగా.. భక్తులు పారవశ్యంలో మునిగిపోయి లోకకల్యాణాన్ని కనులారా వీక్షిస్తున్నారు.
ఈ వేడుకలో ఆలయ అర్చకులు.. భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవంతో పాటు సీతారాముల బంధాన్ని భక్తులకు వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా ప్రాంగణంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగుతున్నాయి. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేశారు
సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి కల్యాణ వేడుకకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు.