తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులతోపాటు ప్రచారపర్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల వాహనాలనూ అధికారులు వదలడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ఆయన వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. రఘునాధపాలెం నుంచి కోయచలక గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని కోయచలక క్రాస్ రోడ్ వద్ద పరిశీలించారు.
ఆ సమయంలో మంత్రి అజయ్ వెంట డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణంతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరంతా ఎన్నికల అధికారుల తనిఖీలకు సంపూర్ణంగా సహకరించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంత్రి తెలియజేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విధి నిర్వహణలో ఇలాంటి తనిఖీలు సర్వ సాధారణమేనని అజయ్ వ్యాఖ్యానించారు. తాను అధికారులకు ఎప్పుడైనా సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.