వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటిలా తయారయింది. సొంత పార్టీ నేతలను సముదాయించలేక.. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వెనకేసుకురాలేక ఇబ్బంది పడుతున్నారట పార్టీ నేతలు. మొన్నటి దాక మూడు గ్రూపులుగా నడిచిన రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుందట. ప్రస్తుతం వంశీవర్గంలోని వారే రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ అనుబంధ ఎమ్మెల్యే గా వంశీ కొనసాగుతుండగా…వంశీ మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు ఇద్దరూ మరో వర్గంగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సిద్ధమయ్యారు. ఆయన రాకముందే ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రాంతానికి చేరుకున్న వంశీ అనుచరులు ముప్పలనేని రవి, కాసరనేని గోపాలరావు వర్గాలు బాహాబాహీకి దిగాయి. రోడ్డుమీదే ఘర్షణపడి రాళ్లు రువ్వుకున్నారు. అక్కడితో ఆగకుండా ఈ ఘర్షణ మొత్తాన్ని వైసీపీలోని వైరి వర్గాలు సోషల్ మీడియాలో.. గన్నవరం వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాయి.
ఈ వ్యవహారం పార్టీకి మరింత డ్యామేజ్‌గా మారిందట. వైసీపీ గ్రూపుల మధ్య సయోధ్యకు ఒకవైపు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు వంశీ వర్గంలోని వారే రొడ్డెక్కి కొట్టుకోవడంపై అధిష్ఠానం కూడా సీరియస్‌గా ఉందట. తన సహజ స్వభావాన్ని పక్కన పెట్టి నియోజకవర్గంలో రాజకీయం చేద్దామని ఎమ్మెల్యే వంశీ ప్రయత్నాలు చేస్తున్నా అవి బెడిసికొడుతున్నాయట. కాంట్రాక్టు పనులు ఇవ్వడం లేదని గన్నవరం సెంటర్‌లో ధర్నాలు.. దళితులపై వివక్ష చూపుతున్నారని ఓ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేయడం.. ఇప్పుడు సొంత వర్గంలోనివారే ఘర్షణ పడటం వంశీకి తలబొప్పి కట్టిస్తున్నాయట.
ఈ పరిణామాలపై యార్లగడ్డ, దుట్టా వర్గాలు తెగ సంతోష పడుతున్నాయట. మరి.. ఇంటా బయటా ఎమ్మెల్యే వంశీ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.