LRS యూటర్న్‌ పై టీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ

-

తెలంగాణలో LRSలేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఆగస్టు చివరి వారంలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ప్లాట్ల క్రయ విక్రయాలు ఆగిపోయాయి. ఆందోళనలను వ్యక్తమయ్యాయి. రాజకీయంగానూ ఈ అంశంపై చర్చ జరగడంతోపాటు రచ్చ రచ్చ అయింది. నియంత్రిత సాగుపై వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం.. కీలకమైన LRSపైనా యూటర్న్‌ తీసుకుంటుందా ఇప్పుడు దీని పైనే అధికార టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుందట…

LRSపై ఏం చేస్తే బాగుంటుందో అని ఉన్నతస్థాయిలో ప్రభుత్వం సమీక్షలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరుగుతున్నాయట..చివరకు గ్రేటర్ ఎన్నికల్లోనూ LRS ప్రభావం పడినట్టు అధికారపార్టీ వర్గాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్షకు పూనుకుంది. LRSపై ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే.. అది ఇంకా నెగిటివ్‌ అయ్యే ప్రమాదం ఉందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సమస్య హైకోర్టుకు కూడా వెళ్లింది. అక్కడ విచారణ పెండింగ్‌లో ఉండటంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై న్యాయనిపుణులతో సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది.

LRS దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ల వరకు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. LRSకు దరఖాస్తు చేసుకుని రశీదులు ఉన్నవారికి ముందుగా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందట. ఆ ప్రక్రియ పూర్తయితే క్రమబద్ధీకరణ.. ఛార్జీల వసూలుపై నిర్ణయం తీసుకుంటే సరిపోతుందనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే LRS కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకుపైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

LRSవిషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజకీయ పార్టీలకు కూడా ఇదో అస్త్రంగా మారింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కార్నర్‌ను చేశాయి విపక్షాలు. అటు కరోనా వల్ల ఆధాయం లేక.. వ్యవస్థ తిరిగి గాడిన పడుతున్న సమయంలో వచ్చిన ఈ ప్రతిష్టంభనతో భూ లావాదేవీలపై ఆధారపడిన అనేక వర్గాలు ఇబ్బంది పడ్డాయి. వందల కోట్ల టర్నోవర్‌ నిలిచిపోయి.. తెచ్చిన అప్పులకు.. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోయి సతమతమైనవారు ఎందరో ఉన్నారు. అందుకే సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభుత్వం నియంత్రిత సాగుపై వెనక్కి తగ్గినట్టుగానే LRSపై యూ టర్న్‌ తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో LRSఛార్జీలను తగ్గించొచ్చనే వాదన నడుస్తోంది. ప్రభుత్వం ఈ దిశగా ఒక ప్రకటన చేయొచ్చని సమాచారం. అయితే ముందుగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఒకే చెప్పి.. కొంత ఊరట ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. మరి.. నిర్మాణరంగం అభివృద్ధితో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news