రాజమండ్రి వైసీపీలో ఆ నేతలంతా ఒక్కటయ్యారా !

-

రాజమండ్రి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతున్న వేళ అనూహ్యపరిణామం చోటు చేసుకుంది.ఎన్నికల వరకు మంచి మిత్రులుగా ఏకతాటిపై నడిచిన నేతలు అధికారంలోకొచ్చాక నియోజకవర్గంలో ఎడముఖం.. పెడముఖంగా మారారు. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలే లేవన్నట్టుగా కలిసిపోయారు ఆ నాయకులు. వీరి ఐక్యతను చూసిన పార్టీ వర్గాలు కూడా ఇది నిజమేనా అన్నట్లు షాక్ కి గురయ్యాయట..రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పై ఇప్పుడు రాజమండ్రి వైసీపీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.


రాజమండ్రి ఎంపీ గా గెలిచిన మార్గాని భరత్‌ ,రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇద్దరూ వైసీపీ ప్రజాప్రతినిధులే. ఎన్నికల వరకు మంచి మిత్రులుగా ఏకతాటిపై నడిచిన వీరిద్దరూ ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వచ్చేసింది. భరత్‌, రాజా వర్గాల మధ్య తలెత్తే గొడవలను సర్దిచెప్పడం వైసీపీ పెద్దలకు కూడా పెద్ద తలనొప్పిగా తయారయింది. అలాంటిది అధిష్ఠానం హెచ్చరికలు పనిచేశాయో ఏమో కానీ రెండు వర్గాలు ఒక్కటై కలుపుగోలుగా తిరిగేస్తునాయట.రెండు వర్గాల మధ్య గొడవలపై పార్టీలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో.. వీరి మైత్రిపైనా ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.

భరత్‌, రాజాల మధ్య గ్యాప్‌ వచ్చిన తర్వాత ఏ శిబిరంలో ఉండాలో తెలియక వైసీపీ కేడర్‌ ఇబ్బంది పడేది. చివరకు పార్టీ కార్యక్రమాలను సైతం వేర్వేరుగానే నిర్వహించేవారు. అన్నింటిలోనూ ఆధిపత్యపోరే నడిచేది. అధికారులకు కూడా ఇబ్బందిగా ఉండేది. రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవడంతో అక్కడున్న వైసీపీ ఇంఛార్జ్‌లు శ్రిఘాకోళపు శివరామ సుబ్రమణ్య, ఆకుల వీర్రాజులను మార్చాలని ఎంపీ భరత్‌ ప్రయత్నించారట. దీనికి ఎమ్మెల్యే రాజా అడ్డుకునేవారని చెబుతారు. ఈ విభేదాల కారణంగానే ఏడాదిన్నరగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ కాకుండా ఆగిపోయాట. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కూర్చుని జాబితాను ఫైనల్‌ చేస్తే పదవులు కట్టబెడతామని అధిష్ఠానం చెప్పి వదిలేసిందట..

భరత్‌, రాజాల మధ్య సయోధ్యకు వైసీపీ పెద్దలు చేయని ప్రయత్నం లేదట. రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు పార్టీ సమాయత్తం అవుతున్న సమయంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల వైఖరి మింగుడు పడలేదట. అందుకే ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి ఇద్దరు నేతలకు గట్టిగానే తలంటినట్టు సమాచారం. కలిసి పనిచేస్తారో లేదో తేల్చుకోవాలని వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే రెండు వర్గాలు దారిలోకి వచ్చాయని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు.

రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరేలా భరత్‌, రాజాలకు సమాన బాధ్యతలు అప్పగించారట వైవీ సుబ్బారెడ్డి. అంతేకాదు.. వైవీ పర్యటనలో ఇద్దరూ కలిసి నడిచారు. సీఎం జగన్‌ జిల్లాకు వచ్చిన సమయంలోనూ ఎంపీ, ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడుకోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచిందట. ఎయిర్‌పోర్టులోనే సీఎం జగన్‌తో సెల్ఫీలు తీసుకుని ఐక్యత చాటారు. ఎక్కడ కనిపించినా నవ్వుతూ పలకరించుకుంటున్నారట. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు ఈ అంశంపైనే ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.

చిన్న చిన్న విషయాలకే అలకబూనే యూవనేతల మధ్య ఈ ఐక్యత శాశ్వతమా.. మూణ్ణాళ్ల ముచ్చటా అన్నది కాలమే చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news