రాజకీయాల్లో ఎందరో ఎన్నో చెబుతుంటారు. అయితే, కొందరు చెప్పే మాటలకు, చేసే వ్యాఖ్యలకు మాత్రం చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి వారిలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయాల్లో ఉన్నా..ఎప్పుడూ కూడా ఊరికేనే మాట జారరు. మీడియా మైకుచూస్తే.. కొంతమంది నాయకులు మాదిరిగా ఆయన ఒళ్లు మరిచిపోయి నోటికి వచ్చిందల్లా మాట్లాడేయరు. చాలా తక్కువగా అది కూడా చాలా మేరకు ఆచితూచి మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడారు. అభూత కల్పన లు, జోస్యాలు ఆయన మాటల్లో ఉండవని అంటారు ఆయన అనుచరులు. దీంతో కృష్ణదాస్ మాట్లాడే వ్యాఖ్యలకు చాలా వాల్యూ ఉంటుంది.
తాజాగా ఓ సందరంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తు తం చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో చాలా బిజీగా ఉన్నారు. రాజధానిలో ప్రజలు చేస్తున్న ఆందోళనలకు ఆయన పూర్తిగా మద్దతిచ్చారు. కుటుంబ సమేతంగా రాజధాని ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు మద్దతిచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మంత్రి కృష్ణదాస్.. తలా తోకాలేకుండా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజలు నివ్వెర పోతున్నారని అన్నారు. రాజధానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే విషయం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు తెలుసన్నారు.
అయినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పిన కృష్ణదాస్.. ఇలా అయితే, బాబుకు ప్రతిపక్ష హోదా ఉండదని అన్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఆచి తూచి మాట్లాడే.. కృష్ణదాస్ నోటి వెంట చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా మిగలదనే వ్యాఖ్యలు రావడంపై చర్చ నడుస్తోంది. గతంలో ఒకరిద్దరు వైసీపీ నాయకులు కూడా ఇవే వ్యాఖ్యలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమేనా? భవిష్యత్తులో అంటే రాబోయే రెండు మూడు మాసాల్లోనే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదా అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది.
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, అది కూడా రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులకు చెందిన వారు పార్టీకి దూరమయ్యారు. రాబోయే రోజుల్లో విశాఖలో రాజధాని ఏర్పాటైతే.. మరో ఇద్దరు నుంచి ముగ్గురు పార్టీకి దూరమయ్యే ప్రభావం కనిపిస్తోంది. బహుశ వీటిని ఉద్దేశించే ధర్మాన ఇలా వ్యాఖ్యానించారని అంటున్నారు. మరి ఇదే నిజమైతే.. సంఖ్యా పరంగా ప్రస్తుతం ఉన్న 23 మందిలో 19కి పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో బాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.