ఎంతైనా గుజరాతోళ్లు గుజరాతోళ్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన నాయకుడే! మరి ఈయన ఏం చేశారు? ఎందుకు ఇలా విశ్లేషకులు ఆయనను టార్గెట్ చేశారు? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఉన్నరాష్ట్రాలు ఆదాయం లేక నానా తిప్పలు పడుతున్నాయి. పరిశ్రమలు నిలిచిపోయాయి. పన్నులు ఆగిపోయాయి. వ్యాపారాలు నిలిచిపోయాయి. మొత్తంగా రాష్ట్రాలకు ఆదాయమే తగ్గిపోయింది. ఇక, ఏపీ వంటి ఆర్ధికంగా చిక్కుల్లో ఉన్న రాష్ట్రాలు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.
ఈ సమయంలో ఎవరైనా ఏం ఆశిస్తారు? వెంటనే ఢిల్లీ వైపు చూస్తారు. కేంద్రం అండగా ఉంటుందని భావిస్తారు. ఉదారంగా నిధులు ఇచ్చి ఆదుకుంటుందని ఆశలు పెట్టుకుంటారు. పోనీ.. ఉదారంగా కాకపోయినా.. రావాల్సిన నిధులైనా వస్తాయని అనుకుంటారు. అంటే.. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లో కేంద్రం తీసుకోగా మిగిలిన వాటిలో రాష్ట్ర జనాభాను బట్టి పన్నులు రావాల్సి ఉంటుంది. దీనినైనా కేంద్రం ఇస్తుందని అనుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించినట్టుగానే కేంద్రం తాజాగా పన్నుల్లో వాటా కింద నిధులు విడుదల చేసింది. ప్రతి నెలా 20న ఇచ్చే ఈ నిధులను ఇప్పుడు కూడా కేంద్రం ఇచ్చింది.
మరి ఏంటి నొప్పి! చక్కగా తీసుకుని వాడుకోవచ్చు కదా?! అంటారా? ఇక్కడే మోడీ తన బుద్ధి చూపించార ని అంటున్నారు ఆర్ధిక నిపుణులు. రాష్ట్ర సీఎం సహా ఆర్ధిక మంత్రి కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తున్నా రు. రాష్ట్రానికి నిజంగా రావాల్సిన పన్నుల్లో వాటాలో కేంద్రం కోత పెట్టింది. దాదాపు 30% నిధులను కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కోత పెట్టింది. ఏపీ విషయానికి వస్తే.. మొత్తం 2020-21వార్షిక సంవత్సరంలో ఏపీకి కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.32237.70 కోట్లు రావాల్సి ఉంది. దీనిని విభాజనం చేసి నెల నెలా విడుదల చేస్తుంది.
అయితే, ఈ మొత్తం నిధుల్లో ఇప్పుడు కేంద్రం నూటికి 30 రూపాయలు కోత పెట్టింది. అంటే రావాల్సిన మొత్తం 32237.70 కోట్లలో ఇప్పుడు రాష్ట్రానికి ఇచ్చే వాటా రూ.2686.47 కోట్లు రావాల్సి ఉంది. కానీ, కేంద్రం మాత్రం రూ.1892.64 కోట్లు మాత్రమేవిడుదల చేసింది. అంటే.. మొత్తం రూ.1521.31 కోట్లకు కోత పెట్టింది. ఇది నిజానికి చాలా పెద్ద మొత్తం. దీంతో ఏపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి గురవుతోంది. మరి ఎందుకిలా జరిగింది? అంటే.. గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వృద్ధి రేటును అధికంగా చూపించడంతో 15వ ఆర్ధిక సంఘం ఏపీని అధిక ఆదాయ రాష్ట్రాల్లో చేర్చింది.
అంతేకాదు, 14వ ఆర్ధిక సంఘం రాష్ట్రానికి పన్నుల వాటాలో 4305 శాతం వాటా ఇవ్వాలని పేర్కొనగా.. అంత వద్దు.. ఏపీలో అందరూ సంపాయించేవారే కాబట్టి దీనిని 4.111 శాతానికి తగ్గించేయొచ్చు అని 15వ ఆర్ధిక సంఘం పేర్కొంది. అంతే! ప్రధాని మోడీ వెనుకా ముందు ఆలోచించకుండా కోసేశారు. ఫలితంగా ఇప్పుడు ఏపీ 15 వందల కోట్లను ఏటా నష్టపోనుంది. ఏం చేద్దాం.. అనుభవించడం తప్ప!! అంటున్నారు పరిశీలకులు.