విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాడేరు. ఇక్కడ నుంచి గత ఏడాది ఎన్నికల్లో కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వైసీపీ టికెట్‌పై విజయం సాదించారు. పూర్తిగా గిరిజన నియోజకవర్గం అయిన పాడేరులో ఇప్పుడు వైసీపీలో నే రాజకీయాలు వేడెక్కాయి. గత ఏడాది జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయిన పసుపులేటి బాలరాజు ఇక్కడ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి కూడా అయిన బాలరాజుకు నియోజకవర్గం కొట్టిన పిండి. పైగా అదేసమయంలో ఆయన తన కుమార్తె దర్శిని ని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.
అంతేకాదు, పసుపులేటికి వైసీపీలో కీలక నాయకుడు విజయసాయి రెడ్డి దగ్గర మంచి చనువు ఉండడం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని నిద్రపట్టనివ్వడం లేదు. నిజానికి పాడేరులో జరిగిన నాలుగు దశాబ్దాల ఎన్నికలను తీసుకుంటే.. ఇక్కడి ప్రజలు ఏ వ్యక్తిని, ఏ పార్టీని కూడా అదేపనిగా గెలిపించిన సందర్భాలు లేవు. దాదాపు అన్ని పార్టీలకు కూడా అవకాశం ఇచ్చారు. అందుకే ఇక్కడ బీఎస్పీ, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా అన్ని పార్టీలు, అందరు నేతలు కూడా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడి గిరిజనులను ఆకట్టుకోవడం అంటే అంత మాటలు కాదు. కేవలం సదరు పార్టీలో ఎలాంటి పోటీ లేకుండా ఉంటేనే గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్. గతంలో 2014లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున గెలిచిన గిడ్డిఈశ్వరి పార్టీ మారి టీడీపీలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను ఇక్కడి గిరిజనులు పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు భాగ్యలక్ష్మి తనకుతిరుగులేదని, వైసీపీ లో తాను తప్ప మరో నేత ఇక్కడ లేరని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా బాలరాజు, ఆయన కు మార్తెల ఎంట్రీ భాగ్యలక్ష్మిని నిద్రపట్టనివ్వడం లేదట.
అంతేకాదు, నేరుగా సాయిరెడ్డితోనే సంబంధాలు నెరపడం, అదేసమయంలో స్థానిక ఎన్నికల్లోనూ అన్నీతామై వ్యవహరించడం, భాగ్యలక్ష్మికి కేడర్ అంతగా సహకరించకపోవడం వంటి పరిణామాలు ఇప్పుడు ఆమెను తీవ్రంగా గందరగోళానికి గురి చేస్తున్నాయని అంటున్నారు. ఏడాది పూర్తయ్యే సరికే పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిణామాలు ఎలా మారతాయోనని ఆమె భావిస్తోందట.