ఖమ్మం రాజకీయాల్లో కలకలం చోటు చేసుకుంటోంది. టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ.. నామా నాగేశ్వరరావును డమ్మీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం. వాస్తవానికి నామా నాగేశ్వరరావు.. కేవలం ఎంపీనే కాదు.. ఆయన టీఆర్ ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కూడా. అలాంటి నేత విషయంలో ఇటు అధికారులు, అటు పార్టీ కేడర్ కూడా దూరం పాటిస్తున్నాయని అంటున్నారు. కొన్నాళ్లుగా నామా పాల్గొంటున్న కార్యక్రమాలకు కీలకమైన అధికారులు డుమ్మా కొడుతున్నారు. వాస్తవానికి ఎంపీ పాల్గొనే కార్యక్రమానికి ఖచ్చితంగా రావాల్సి ఉన్నా.. వారు రాలేదు.
దీంతో ఎంపీ తీవ్ర మనస్థాపానికి గురై.. పై అధికారులకు ఫిర్యాదు చేసే వరకు విషయం వచ్చింది. ఇక, దిశ.. కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలోనూ అధికారులు మీడియాకు సైతం సమాచారం ఇవ్వ లేదు. దీంతో ఎంపీ నామా అనుచరులే.. మీడియా మిత్రులను పిలిచి కార్యక్రమం వివరాలను అందించా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పార్లమెంటు అభివృద్ధి నిధులు ఉన్నాయి. ఇస్తాను అన్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం, ఎంపీ పాల్గొనే కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు.. ఏదైనా కార్యక్రమాల్లోనూ నామా పేరును ఉచ్ఛరించేందుకు.. ఆయనను ప్రశంసించేందుకు కూడా ఇక్కడి వారు సిద్ధంగాలేరనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీనంతటికీ.. టీఆర్ ఎస్‌లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలేనని అంటున్నారు పరిశీలకులు. టీఆర్ ఎస్ పార్టీకే చెందిన కీలక నాయకుడు .. నామా విషయంలో తెరవెను క అధికారులను నియంత్రిస్తున్నారనే వాదన ఇటీవల కాలంలో వినిపిస్తుండడం గమనార్హం.
జిల్లాకు చెందిన కీలక టీఆర్ఎస్ నేత హవానే ప్రస్తుతం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మాటకు భయపడే అధికారులు సైతం ఎంపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం ఎటు దారితీస్తుందో ? చూడాలి.