రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి అనిశ్చితి నెలకొంది. కొంతకాలంగా అంతా సద్దుమణిగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. ఇన్నాళ్లు టిపిసిసి చీఫ్ రేవంత్ పై అసంతృప్తి తో ఉన్నారు. తాజాగా ఆ పరిస్థితి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎదురైంది.
సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. దీనికి కొందరు నాయకుల్ని ఆహ్వానించారు. అయితే ఏమైందో ఏమో కానీ మళ్లీ వాళ్లను సమావేశానికి రావొద్దని చెప్పడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గంగా భావిస్తున్న నాయకులు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌లో భాగంగా కోదాడ నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమాయత్తం అయ్యారు. ఇందుకోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీనికి ఉమ్మడి జిల్లాలోని నాయకులను పిలిచారు. అయితే మళ్లీ వీళ్లను రావొద్దని గాంధీ భవన్ నుంచి మంగళవారం ఫోన్లు వచ్చాయని సమాచారం. దాదాపు అందరు నాయకులు ఆగిపోవాల్సి రావడం, హాజరైన పటేల్ రమేష్ రెడ్డిని కూడా బయటకు పంపడం వివాదాస్పదమైంది.