సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గురువారం రోజున కదులుతున్న కారులో నుంచి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటనతో బెల్‌గ్రాడ్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
మ్లాడెనొవాక్ సమీపంలో ఓ యువకుడు (21) కదులుతున్న కారులోంచి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. దీంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అనంతరం నిందుతుడు అక్కడి నుంచి పారిపోయాడని.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
సంఘటనా స్థలంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఆరోగ్య శాఖ మంత్రి డానికా గ్రుజిసిక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఉగ్రమూకల హస్తం ఉందని అంతర్గత మంత్రి బ్రాటిస్లావ్ గాసిక్ ఆరోపించారు. ఇటీవలే బెల్‌గ్రాడ్ సమీపంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో బుధవారం 13 ఏళ్ల బాలుడు ఇష్టారీతిన కాల్పులు జరపడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.