మన దేశంలో కోవిడ్ టీకాలు సరిపోయినంతగా లేవు. దీంతో 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను ఇవ్వడం లేదు. 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే, అది కూడా గతంలో సింగిల్ డోసును తీసుకున్న వారికే ఇప్పుడు రెండో డోసును ఇస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాలు మరిన్ని కోవిడ్ డోసులను పంపించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే అమెరికాలో మాత్రం టీకాలను వేయించుకునేందుకు ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. దీంతో బాబ్బాబూ.. టీకాలను వేయించుకోండి.. ప్లీజ్.. అంటూ అమెరికా ప్రభుత్వం, అధికారులు ప్రజల వెంట పడుతున్నారు.
అమెరికాలో వచ్చే జూలై వరకు 70 శాతం మంది యువతకు టీకాలను వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ టీకాలను తీసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. దీంతో వారి వద్దకే వెళ్లి టీకాలను వేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే టీకాలు తీసుకున్న యువతకు ఉచితంగా బీర్ ఇస్తామని ప్రకటించారు.
కోవిడ్ మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సిన్ కార్డుతో ఉచితంగా బీర్ పొంద వచ్చని ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే అక్కడ మద్యం సేవించడానికి కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. అందువల్ల ఈ ఆఫర్ 21, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారికే వర్తిస్తుంది. ఇక అక్కడి కొన్ని రెస్టారెంట్లు అయితే టీకాలను వేయించుకున్న యువతకు ఉచితంగా డోనట్స్‌ను అందిస్తామని ప్రకటించాయి. మరి అక్కడి ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఫలిస్తుందో, లేదో చూడాలి.