ఇటీవల అమెరికాలోని అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్ ప్లగ్ గగనతలంలో ఊడిపోయిన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్‌లను దాదాపు అన్ని దేశాలు పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. అయినా ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో తరచూ లోపాలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం రోజున జపాన్ ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు ఏర్పడ్డాయి. వీటిని గుర్తించి అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని సంస్థ వెల్లడించింది.
సపోరో-న్యూ చిటోస్ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్ 1182 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే నాలుగు లేయర్లు కలిగిన కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు వెలుగు చూశాయని ఈ ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారని.. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 59 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పింది. ఇది బోయింగ్ 737 మ్యాక్స్ 9 శ్రేణిలోనిది కాదని పేర్కొంది.