కలిసి సాగుతామంటూ చెప్పి.. జిన్​పింగ్​ను మళ్లీ నియంతే అన్న బైడెన్

-

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన శాన్​ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అనంతరం కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించిన ఇరు దేశాల అధినేతలు.. భేటీ తర్వాత స్నేహగీతం పాడారు. భవిష్యత్​లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే భేటీ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బైడెన్ మాత్రం మరోసారి నోరు పారేసుకున్నారు.

ఈ మీడియా సమావేశంలో ఓ విలేకరి ‘జిన్‌పింగ్‌ను మీరు ఇంకా నియంతగానే భావిస్తున్నారా?’ అని ప్రశ్నించగా.. ‘‘అవును. ఆయన నియంతే. ఆయన కమ్యూనిస్ట్‌ దేశాన్ని పాలిస్తున్నారు. ఆ ప్రభుత్వం మనకంటే భిన్నమైంది’’ అని బైడెన్ ఎప్పటిలాగే జిన్‌పింగ్‌ను ‘నియంత’గా అభివర్ణించడం గమనార్హం. ఏదేమైనా చర్చల్లో మాత్రం పురోగతి సాధించామని తెలిపారు. అయితే ఇరు దేశాల సంబంధాలను మెరుగుపర్చుకునేలా నేతలిద్దరి మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ ప్రకటించిన కాసేపటికే బైడెన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news