మరో వివాదంలో రిషి సునాక్.. ప్రజాధనం వృథా చేస్తున్నారని విమర్శలు

-

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్​ను వివాదాలు చుట్టుముట్టుతూనే ఉన్నాయి. తాజాగా రిషి సునాక్ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని అక్కడి పౌరులు విమర్శిస్తున్నారు. స్వల్ప దూర ప్రయాణాలకు కూడా ఆయన హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారని మండిపడుతున్నారు. రైలులో ప్రయాణిస్తే కేవలం గంటలో చేరుకునే ప్రయాణానికి రిషి సునాక్‌ హెలికాప్టర్‌ ఉపయోగించడంపై విమర్శలు వస్తున్నాయి. సౌతాంప్టన్‌లోని ఫార్మసీని సందర్శించేందుకు ప్రధాని మంగళవారం ప్రైవేటు హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణానికి ప్రజా ధనాన్ని ఖర్చు చేసినట్లు ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్‌ వెల్లడించింది.

ప్రధాని సాతాంప్టన్‌కు వాటర్‌లూ స్టేషన్‌ నుంచి రైలులో ప్రయాణిస్తే 30 పౌండ్లు (సుమారు రూ. 3000) ఖర్చవుతుంది. కానీ, ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ఆయన ప్రయాణానికి 6,000 పౌండ్లు ( సుమారు రూ. 6 లక్షలకు పైగా) వ్యయం చేసి ఉండొచ్చని వార్తా పత్రికలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రజా ధనాన్ని ప్రధాని వృథా చేస్తున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ప్రధాని ప్రతినిధి స్పందించారు. ‘‘సమయాన్ని బట్టి ప్రధాని రవాణా ప్రణాళికలు మారుతాయి. సాధారణంగానే ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు త్వరగా ప్రదేశాలకు చేరుకోవడం, తిరిగి రావడం వల్ల ఆయన సమయం వృథా కాదు. అందువల్ల హెలికాప్టర్‌లో ప్రయాణించడం తప్పు కాదు’’ అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news