రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్రపంచానికి తగులుతోంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలతో పాటు ఈ రెండు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రభావం పడుతోంది.
నిన్నమొన్నటి వరకు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 100డాలర్లకు చేరగానే..ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. ఇప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లకు చేరుకుంది. 2014 నుంచి గరిష్ట స్థాయికి చేరింది. ముడిచమురును ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు పెట్టాయి. దీని ప్రభావంతో కూడా అంతర్జాతీయంగా ముడిచమురుకు డిమాండ్ పెరిగి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అగ్రశ్రేణి చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియా ఏప్రిల్లో ఆసియా క్రూడ్ ధరలను భారీగా పెంచవచ్చని వాణిజ్య వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ ప్రభావం భారత్ పై ఖచ్చితంగా పడుతుంది. భారత్ దేశం చమురు అవసరాల కోసం 80 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతుంది. దీంతో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డిజిల్ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డిజిల్ పై సుంకాలు తగ్గించుకుంటే తప్పా… సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండకపోవచ్చు.