అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేశ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తగిన అర్హతలు ఆమెకు లేవని ట్రంప్ నిక్కీపై విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా నిక్కీ హేలీకి ఆమె తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు ‘నమ్రతా నిక్కీ రణధావా’ కాగా అందులోని తొలి పదం ‘నమ్రతా’ను ఉద్దేశపూర్వకంగానే ‘నింబ్రా’ అంటూ తప్పుగా పదే పదే ట్రంప్ ఉచ్ఛరించారు. రిపబ్లికన్ల మద్దతు కూడగట్టుకునేందుకు ఆమెను పరిహసించేలా జాతీయత, పౌరసత్వం అంశాలను ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని నిక్కీ హేలీ మండిపడ్డారు. వయో భారంతో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేరని విమర్శించారు. దేశం, ప్రపంచంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు 80 ఏళ్ల నిండిన వ్యక్తులు (బైడెన్, ట్రంప్‌ను ఉద్దేశించి) అధ్యక్షులుగా మనకు అవసరమా? అంటూ వ్యాఖ్యానించారు. అభద్రతా భావానికి గురైనప్పుడే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని పేర్కొన్నారు.