థాయ్ లాండ్ రాజు ఆ దేశ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా జైలు శిక్షను ఎనిమిదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు. వాస్తవానికి షినవత్రా ఇటీవలే విదేశాల్లో ప్రవాసం నుంచి 15 ఏళ్ల తరువాత థాయ్ లాండ్ కి తిరిగి వచ్చారు. ఇటీవలే ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్భందించిన తొలి రోజునే ఆయన అనారోగ్యం పాలయ్యారు. అధికార దుర్వినియోగం, వ్యక్తిగత ప్రయోజనాల వైరుధ్యాల్లో దోషిగా తేలడంతో తక్సిన్ కి సుప్రీకోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని తక్సిన్ షనవత్రాకు విధించిన ఎనిమిదేళ్ల శిక్షను థాయ్ లాండ్ రాజు ఏడాదికి తగ్గించారు. థాయ్ లాండ్ రాజు మహా వజిరాలాంగ్ కార్న్ తీసుకున్న ఈ నిర్ణయం శుక్రవారం రాయల్ గెజిట్ లో ప్రచురించబడింది. దీని తరువాత రాజు నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది. తక్సిన్ షినవ్రతా 2001 నుంచి 2006 వరకు థాయ్ లాండ్ ప్రధానిగా కొనసాగారు. 2008లో రాజకీయ ప్రేరేపిత ఆరోపణలపై జైలు శిక్షను ఎదుర్కొన్నప్పుడు థాయ్ లాండ్ నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి దేశం వెలుపల నివసిస్తున్నాడు. ఆగస్టు 22న ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు.