‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అవకాశాలను అన్వేషించడానికి భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని సెప్టెంబర్ 1న వెల్లడించింది కేంద్రం. అయితే.. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నికపై విధివిధానాలను రూపొందించేందుకు రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం స్వాగతించదగినదన్నారు.
వివిధ స్థాయిలలో తరచుగా జరిగే ఎన్నికల కంటే ప్రభుత్వం పాలనపై దృష్టి సారించడం ఈ సమయంలో అవసరమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల ఖర్చును తగ్గించడం.. పరిపాలనా, భద్రతా దళాలపై భారాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని ఆమె అన్నారు. ఈ చొరవ మనం ఒక దేశం అనే నమ్మకానికి మద్దతు ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని, వాటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పురంధేశ్వరి అన్నారు. ‘‘రాష్ట్రపతి భవన్లో జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబం అంతా వెళ్లి హాజరయ్యాం. దీన్ని తప్పుపడతారా? ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ రంగు పులిమారు” అని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు.
మరోవైపు పేదల కోసం కేంద్రం గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే దాన్నీ రాజకీయం అనడం సరికాదని పురందేశ్వరి అన్నారు. ఏపీలోని హిందూ దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో అన్య మతస్తులను నియమిస్తున్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాము దేవాలయాల వద్ద సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని చెప్పారు.