అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మరోసారి తుపాకీ గుండ్లు అమాయకుల ప్రాణాలను బలికొన్నాయి. జార్జియా రాష్ట్రం హెన్రీ కౌంటీలోని హాంప్టన్ ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల కారణంగా నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని హాంప్టన్ పోలీస్ చీఫ్ జేమ్స్ టర్నర్ వెల్లడించారు.
హాంప్టన్‌కు చెందిన 40 ఏళ్ల లాంగ్‌మోర్ ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు గుర్తించారు. లాంగ్‌మోర్ గురించి సమాచారం అందిస్తే 10వేల డాలర్లను రివార్డుగా ఇస్తామని హెన్నీ కౌంటీ పోలీస్ ఉన్నతాధికారి స్కాండ్రెట్ ప్రకటించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు అదే ప్రాంతంలో దాదాపు 5 గంటల పాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2023లో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 31 కాల్పుల ఘటనలు జరగ్గా అందులో దాదాపు 153 మంది ప్రాణాలు కోల్పోయారు.