మరో వారం రోజుల్లో పాకిస్థాన్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. కొన్ని గంటల క్రితం అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఆయనకు పదేళ్ల శిక్ష పడింది. ఇక తాజాగా మరో కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు ఇమ్రాన్పై 150కి పైగా కేసులు నమోదయ్యాయి.
అసలు తోషఖానా కేసు ఏంటంటే?
పాక్ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బహుమతి కావాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని ఆరోపణలున్నాయి. అంతే కాకుండా తాను ప్రధానిగా ఉన్న సమయంలో మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థానీ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నదే ఈ కేసు సారాంశం.