ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ ఇవాళ కస్టడీలోకి తీసుకుంది. ఈరోజు ఉదయం చంచల్గూడ జైలు నుంచి అతణ్ని కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు విచారించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జప్తు చేసిన దస్త్రాలపై విచారించనున్నట్లు సమాచారం. శివ బాలకృష్ణకు చెందిన 15 బ్యాంకు ఖాతాలు లవాదేవీలపైనా అధికారులు ఆరా తీయనున్నారు.
రెరా కార్యదర్శిగా ఉన్న సమయంలో జారీ చేసిన అనుమతులు, దస్త్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విచారణ సమయంలో భవన నిర్మాణ గుత్తేదారులను కూడా పిలిపించి విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో శివబాలకృష్ణను విచారణ చేయనుంది. ఈ ప్రక్రియలో అతడిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
మరోవైపు శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. శివబాలకృష్ణ అవినీతి చిట్టాతో పాటు కేసుకు సంబంధించిన నివేదికను సంబంధిత శాఖాధికారులకు ఏసీబీ పంపించడంతో సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.