రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనంపై (క్రెమ్లిన్) డ్రోన్ దాడి జరిగిందని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించింది. దీన్ని ఉగ్ర ప్రణాళికగా భావిస్తున్నామని తెలిపింది. తమ అధ్యక్షుడిని అంతం చేసేందుకే ఈ ప్రయత్నాలని ఆరోపించింది.
‘క్రెమ్లిన్ లక్ష్యంగా రెండు డ్రోన్లు దూసుకొచ్చాయి. వెంటనే స్పందించి వాటిని కూల్చివేశాం. ఈ ఘటనలో పుతిన్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. దాడి సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరు. నోవో ఒగర్యోవో నివాసం నుంచి పనిచేస్తున్నారు. క్రెమ్లిన్ భవనానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. పుతిన్ సురక్షితంగా ఉన్నారన్న ఆయన.. అధ్యక్షుడి షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదన్నారు. ఈ డ్రోన్ల దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం వెల్లడైన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నగరంలో ఎటువంటి అనధికారిక డ్రోన్లు ఎగరకుండా నిషేధం విధిస్తున్నట్లు మాస్కో మేయర్ వెల్లడించారు.