ఆర్థిక మాంద్యం టెక్ కంపెనీలను వెంటాడుతోంది. టెక్కీలు ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోనన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రముఖ టెక్ దిగ్గజం మెక్రోసాఫ్ట్ కూడా ఇప్పటికే వేల మందిని ఇంటికి పంపింది. తాజాగా ఈ కంపెనీ మరో నిర్ణయంతో ఉద్యోగులపై పిడుగు వేసింది.
ఈ ఏడాది ఫుల్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచకూడదని, బోనస్‌లు, స్టాక్ అవార్డులకు బడ్జెట్ తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంటర్నల్ ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం. దీనిపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి స్పందించడానికి ముందుకు రాలేదు.
‘గతేడాది మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరుకు అనుగుణంగా పరిహారం చెల్లింపునకు గణనీయంగా పెట్టుబడి పెట్టాం. మన గ్లోబల్ మెరిట్ బడ్జెట్ దాదాపు డబుల్ అయింది. ఈ ఏడాది పలు రూపాల్లో ఆర్థిక పరిస్థితులు చలా విభిన్నంగా ఉన్నాయి’ అని ఆ మెయిల్‌లో సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు సమాచారం.